close logo

క్రూరత్వ సాహిత్యం – భారతదేశాన్ని, హిందూ ధర్మాన్ని నాశనం చెయ్యడానికి వాడబడుతున్న పాశ్చాత్య ఆయుధం

1927 లో విడుదలయిన కేథరిన్ మాయో రచన “మదర్ ఇండియా”, బహుశా భారత దేశానికి, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా రచించబడ్డ మొదటి క్రూరత్వ సాహిత్యం. ఈ పుస్తకం లో మాయో హిందువులని ఒక అనాగరిక, క్రూర జాతిగా చిత్రీకరించింది. అక్కడక్కడ జరిగిన కొన్ని సంఘటనలని ఎంచుకొని హిందూ పురుషులని, స్త్రీలని పిల్లలని హింసించే వారిగా చిత్రీకరించింది. హిందూ సమాజం అనాగరికమైనదని, వారికి బ్రిటీష్ వారు నాగరికత నేర్పుతున్నారు అని ప్రపంచాన్ని మోసం చెయ్యడం ఈ పుస్తక లక్ష్యం. ఈరోజుకి కూడా భారత దేశానికి, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా క్రూరత్వ సాహిత్యం సృష్టించబడుతూనే ఉంది.

“క్రూరత్వ సాహిత్ర్యం” అంటే ఏమిటి?

స్థానిక నాగరికతలని, సంస్కృతులని అణచివేసి, స్వాధీనపరచుకొని, జీర్ణీకరించుకొని చివరికి నాశనం చెయ్యడానికి పాశ్చాత్యులు వందల సంవత్సరాలుగా వాడుతున్న ఒక మానసిక ఆయుధమే ఈ క్రూరత్వ సాహిత్యం. దీనికి మాధ్యమ రంగం తోడైతే దీని ప్రభావం అత్యధిక స్థాయిలో, కొన్ని సార్లు శాశ్వతంగా ఉంటుంది. ఎవరైతే తమ నాగరికతని, సంస్కృతిని నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారో వారినే నాశనం అవుతున్న వారు తమని రక్షిస్తున్న వారిగా భావించడం ఇందులో అత్యంత ప్రమాదకరమైన విషయం. పాశ్చాత్యులు ఇప్పటికే దీనిని స్థానిక అమెరికన్లకి, నల్ల జాతి వారికి, మనకి, ఇంకా ఎన్నో జాతులకి వ్యతిరేకంగా ఉపయోగించారు, ఉపయోగిస్తున్నారు. క్రీస్టియన్ మిషనరీలు, చర్చి, NGOలు, పాశ్చాత్య/భారత విద్యా సంస్థలు, మనవ/జంతు సంబంధ రక్షణ సంస్థలు మనకి వ్యతిరేకం గా ఈ క్రూరత్వ సాహిత్యాన్ని వాడుతున్నాయి.

“తాము ముందుగా ఒక నాగరికతని లక్ష్యంగా ఎన్నుకొని, అలా ఎంచుకున్న నాగరికత/సంస్కృతి తమ ప్రజలపైనే హింస సాగిస్తోందని, కాబట్టి వారిని రక్షించడానికి పాశ్చాత్య జోక్యం తప్పనిసరి అని ప్రపంచాన్ని నమ్మించే లక్ష్యంతో సృష్టించబడే సాహిత్యమే ఈ క్రూరత్వ సాహిత్యం” అని శ్రీ రాజీవ్ మల్హోత్రా దీని గురించి తన “బ్రేకింగ్ ఇండియా” పుస్తకంలో రాశారు. ప్రతీ సమాజం, నాగరికత, వ్యవస్థ, మతం, కులం, సంఘం, దేశం, ఇలా అన్నిట్లో ఎంతో కొంత చెడు ఉండి తీరుతుంది, అనే నిజం మీదే ఈ వ్యూహమంతా ఆధారపడి ఉంటుంది. వివాహ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థల లాంటి వాటికి కూడా ఇది వర్తిస్తుంది. ప్రతీ వ్యవస్థ వల్లా నష్ట పోయే వాళ్ళు కొందరైనా ఉంటారు కదా.

ఒక చిన్న ఉదాహరణ ద్వారా దీనిని వివరించే ప్రయత్నం చేస్తాను. కోటి మంది జనాభా ఉన్న ఒక పట్టణం ఉందనుకోండి. కోటి మంది జనాభా ఉన్న పట్టణంలో సహజంగానే అన్ని వృతుల వారు, మతాల వారు, కులాల వారు, పొడుగు వారు, పొట్టి వారు, నల్ల వారు, తెల్ల వారు, దొంగలు, హంతకులు, ఇలా అందరూ ఉంటారు. అది రామ రాజ్యం అయితే తప్ప అక్కడ హత్యలు, మానభంగాలు, దోపిడీలు, కొట్లాటలు ఇలా అన్ని రకాల నేరాలు జరుగుతూనే ఉంటాయి. అక్కడ గత 5 సంవత్సరాలలో 100 హత్యలు జరిగాయి అనుకుందాం. ఆ పట్టణంలో లో ఉన్న పొడుగు వారిని నాశనం చెయ్యడం కనుక లక్ష్యం అయితే వారికి వ్యతిరేకంగా క్రూరత్వ సాహిత్య సృష్టి జరుతుగుతుంది. 100 హత్యలలో కొన్నైనా పొడుగువాడు పొట్టి వాడిని చంపినవి ఉంటాయి. మీడియా ఆ హత్యల మీదే దృష్టి పెడుతుంది. “పొడుగు వాడి చేతిలో బలైపోయిన మరో పోట్టివాడు” లాంటి శీర్షికలు ఇటువంటి హత్య జరిగిన ప్రతీ సారీ మధ్యమ రంగంలో విపరీతంగా కనిపిస్తాయి. కొంత కాలానికి న్యాయ వ్యవస్థ ఆ హత్యలకి పొడుగుకి ఏ సంబంధం లేదు అని తేల్చవచ్చు, కానీ దానికి మధ్యమ రంగం ప్రాధాన్యత ఇవ్వరు, అందువల్ల ప్రజలకి ఆ విషయం తెలియదు. ఇలా కొంత కాలం జరిగేసరికి “పొట్టి వారిని చంపేస్తున్న పోడుగువారు” అనే వృత్తాంతం ప్రజలలో బలంగా నాటుకుపోతుంది.

ఇలా క్రూరత్వ సాహిత్యాన్ని మాధ్యమ రంగ సహాయంతో ఉపయోగించి ఏ వర్గాన్నైనా, ఏ వర్గానికైనా వ్యతిరేకం అని ప్రజలని నమ్మించవచ్చు. విషయాన్ని బాగా లోతుగా, సమాచారాన్నంతా ఉపయోగించి విశ్లేషిస్తేనేకానీ అసలు విషయం తెలియదు. దీని ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందంటే చివరికి పొడుగు వారు కూడా దీనిని నమ్మేస్తారు, నమ్మడమే కాకుండా ఈ సాహిత్యాన్ని సృష్టిస్తున్న వారి దగ్గరికే సహాయం కోసం కొందరు వెళ్ళినా ఆశ్చర్యం లేదు. ఇలా క్రూరులుగా చిత్రీకరించాబడ్డ పోడుగువారిని, పోట్టివారిని కాపాడటం అనే నెపంతో నాశనం చేసేస్తారు. ఈ ఉదాహరణలో పొడుగు వారి స్తానంలో హిందూ ధర్మాన్ని పొట్టి వారి స్థానంలో ఇతర మతాలని పెట్టి చూస్తే మనపై జరుగుతున్న కుట్ర మీకే అర్ధమవుతుంది.

ముందుగా నిర్ధారించుకున్న వృత్తాంతానికి సంబంధించిన వార్తలకి మాత్రమే విశేష ప్రచారం ఇవ్వడం, కొన్ని సందర్భాలలో వార్తలని ఈ వృత్తాంతానికి తగ్గట్టుగా మార్చి ప్రచారం చెయ్యడమే ఈ వ్యూహం.

భారతదేశం   మానభంగాల   రాజధానా  ?

నిర్భయ సంఘటన తరువాత మన దేశంలో జరుగుతున్న మానభంగాలకి ప్రాంతీయ, జాతీయ అలానే అంతర్జాతీయ మాధ్యమాలు విపరీత ప్రచారాన్ని ఇస్తున్నాయి. మన తెలుగు చానళ్ళు ఒకడుగు ముదుకు వేసి మగ వారిని “మ్రుగాళ్ళు” గా మార్చేశాయి. ఒక సమయంలో భారతదేశాన్ని “ప్రపంచ మానభంగాల రాజధాని” అని పిలిచారు. ఈ ప్రచారం వల్ల ప్రభావితమైన ఒక జర్మన్ విశ్వవిద్యాలయం పురుషుడు అన్న కారణంగా ఒక భారతీయుడికి తమ విశ్వవిద్యాలయంలో ప్రవేశాన్ని నిరాకరించింది. స్త్రీని దేవతగా పూజించే ఏకైక సంస్కృతి మనది. ఇటువంటి మన దేశంలో స్త్రీలపై జరిగే ఏ చిన్న దాడిఅయినా యావత్ దేశానికి సిగ్గుచేటే అయినా, వాస్తవ పరిస్తితిని కూడా సరిగా అర్ధం చేసుకోవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా దానితో జాతి గౌరవం ముడి పడి ఉన్నప్పుడు. “యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్” వారి మానభంగ సంబంధ గణాంకాలని క్రింద చూడండి (2003 – 2010. తరువాతవి అందుబాటులో లేవు)

ఈ గణాంకాలని చూసిన ఎవరికైనా అర్ధమయ్యే విషయం, ప్రపంచంలో స్త్రీలకి అత్యంత సురక్షితమైన దేశం, భారత దేశం అని. దానికి కారణం ముమ్మాటికీ, “ప్రతీ స్త్రీలో తల్లిని చూడు” అని బోధించే హిందూ ధర్మమే. అయితే మనం జర్మనీ విశ్వవిద్యాలయాన్ని తప్పుబట్టాలెం. క్రూరత్వ సాహిత్యామే ఇక్కడ సమస్య. “భారతదేశం, ముఖ్యంగా హిందూ సమాజం పురుషాధిఖ్య సమాజం, వారు స్త్రీలని అణగద్రోక్కుతున్నారు” అనే వృత్తాంతాన్ని ప్రచారం చేసి తద్వారా స్త్రీలకి అభద్రతా భావాన్ని, పురుషులపై విముఖతని కల్పించి, విడాకులు పెంచి, కుటుంబ వ్యవస్తని నాశనం చేసి తద్వారా హిందూ సమాజాన్ని దెబ్బ తీయడమే ఈ ప్రచార లక్ష్యం. పాత తరం వారు కొంచెం లోతుగా ఆలోచిస్తే, ఉమ్మడి కుటుంబ వ్యవస్థని ఇలానే నాశనం చేసారు అనే విషయం అర్దమవుతుంది. ఇప్పుడు పురుషుడికి వ్యతిరేకంగా క్రూరత్వ సాహిత్య సృష్టి జరుగుతుంటే అప్పుడు అత్తగారికి వ్యతిరేకంగా జరిగేది.

క్రూరత్వ సాహిత్యం సృష్టించే/ప్రచారం చేసే వారి అంకెల గారడీకి ఈ ప్రక్క చిత్రమే ఉదాహరణ. ఇది చూసిన ఎవరికైనా కలిగే అభిప్రాయం భారతదేశం లో మానభంగాలు చాల ఎక్కువ, ప్రపంచంలోనే మనం రెండో స్థానంలో ఉన్నాం అని. ఇదే వీళ్ళ తెలివి. జనాభాని పరిగణలోకి తీసుకోకుండా చూపిస్తున్న ఈ లెక్కలు మనల్ని తప్పు దోవ పట్టించడానికే. ఈ చిత్రంలో ఉన్న మిగిలిన అన్ని దేశాల జనాభా అంతా కలిపినా కూడా 100కోట్లు దాటదు. అంటే నిజానికి మన దగ్గర కంటే మిగిలిన దేశాలలో ఈ నేరాలు దాదాపు 8 రెట్లు ఎక్కువగా జరుగుతాయి.

క్రూరత్వ సాహిత్యం గురించి అర్ధమైతేనే కానీ మన దేశంపై, ధర్మంపై, సంస్కృతిపై జరుగుతున్న వివిధ దాడులని అర్దం చేసుకోలేము

 1. దీపావళి నాడు బాంబులు పేలిస్తే కాలుష్యం.
 2. హోలీ ఆడితే నీరు వృధా
 3. వినాయక చవితి వలన నీటి కాలుష్యం
 4. పుట్టలో పాలు పొయ్యడం మూఢనమ్మకం
 5. కోడి పందాల వల్ల కోళ్ళకి, ఎడ్ల పందాల వల్ల ఎడ్లకి ఇబ్బంది
 6. జల్లికట్టులో జంతు హింస

ఇలా చెప్తూ పోతే ఇంకా బోలెడు. ఇది ఇలానే కొనసాగితే, హిందువులు గాలి పీల్చడం వలన వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోతోంది కాబట్టి హిందువులు గాలి పీల్చకూడదు అని కూడా అంటారు. పైన నేను ఉదాహరించిన వాటిలో కొంత నిజం లేకపోలేదు. అయితే వీటిని వ్యతిరేకించే సంస్థలకి కానీ, మనుష్యులకి కానీ జంతువులపై కానీ, పర్యావరణంపై కానీ ప్రేమ లేదు. వారి లక్ష్యం మనల్ని మన సంస్కృతి నుండి దూరం చెయ్యడం. అలా దూరమైన వారిని మతం మార్చడం సులభం.

దీపావళి వల్ల వాయు కాలుష్యం, జల్లికట్టులో జంతు హింస నిజమే. కొన్ని వేల ఎడ్లు పాల్గొనే సంబరంలో అక్కడక్కడా ఎడ్లని ఇబ్బంది కలిగించే సంఘటనలు జరగడం సహజం. అయితే దీనికి పరిష్కారం నియంత్రణ. నియమ నిబంధనలు ఏర్పరిచి వాటిని సరిగా అమలు చెయ్యడం. అంతే కానీ నిషేధం కాదు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అని ప్రయాణాలని నిషేధించరు కద.

ఒకే వార్త – వివిధ వృత్తాంతాలు

ఒకే వార్తని ఎన్ని రకాలుగా చూపించవచ్చో ఇప్పుడో ఉదాహరణ సహాయంతో చూద్దాం —

వార్త: రోగి భర్త ఒక వైద్య శాలలో నర్స్ ని కొట్టాడు

అన్ని వివరాలతో కూడిన వార్త: పంజాబ్ అకాలీదళ్ నాయకుడైన పరమ్జీత్ సింగ్, తన భార్యకి ఒక ప్రైవేటు ఆసుపత్రి లో ప్రాధాన్యత ఇవ్వలేదు అన్న కారణంగా గర్భవతి అయిన నర్స్ పై చెయ్యి చేసుకున్నాడు

అవకాశం ఉన్న వృత్తాంతాలు:

 1. స్త్రీలని అణగద్రోక్కుతున్న అకాలీదళ్
 2. పంజాబ్ లో స్త్రీలకి రక్షణ కరువు
 3. నర్స్ పై మరో దాడి
 4. భారతదేశంలో గర్భవతులకి రక్షణ కరువు
 5. మరో సారి దాడికి గురైన ప్రైవేటు ఆసుపత్రి ఉద్యోగి

ఈ వార్తలో భాగమైన వారి కులం, మతం, ప్రాంతం లాంటి వాటిని పరిగణలోకి తీసుకుంటే ఇలాంటి వృత్తాంతాలని ఇంకా సృష్టించవచ్చు. ఇటువంటి ప్రచారం పట్ల భారతీయులు, హిందువులు జాగ్రతగా ఉండటం, సోషల్ మీడియా ద్వారా వ్యతిరేకించడం చాలా అవసరం.

(This article was first published by IndiaFacts)

(Image credit: moneyweb.co.za)

Disclaimer: The opinions expressed in this article belong to the author. Indic Today is neither responsible nor liable for the accuracy, completeness, suitability, or validity of any information in the article.

Leave a Reply