close logo

గురుర్బ్రహ్మ

మనందరికీ తెలిసిన ఒక శ్లోకం ఇలా ఉంది. ‘గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః –గురుః సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః’

గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, అలాగే గురువే పరంబ్రహ్మ. అలాంటి గురువుకు నమస్కరిస్తున్నాను అని దీని అర్థం.

ఇక్కడ మొదటి వాక్యంలో ఒక బ్రహ్మ గూర్చి చెప్పారు. రెండవ వాక్యంలో మళ్ళీ బ్రహ్మ అంటూ చెప్పారు. ఈ ఇద్దరు బ్రహ్మలకూ తేడా ఏమిటి? దీనికి జవాబు చాలమంది చెప్పలేరు. అంతో ఇంతో వేదాంతశాస్త్రం చదివితే దీనికి జవాబు తెలుస్తుంది.

మనకు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తెలుసు. బ్రహ్మ అంటే నాలుగు తలల బ్రహ్మ, సరస్వతీదేవి భర్త, సృష్టికి కారణమైనవాడు. విష్ణువు అంటే వైకుంఠంలోనో లేక పాలసముద్రంలోనో లక్ష్మీదేవితో సేవలు చేయించుకుంటూ భూదేవిని పోషిస్తూ ఉండే దేవుడు. మహేశ్వరుడు అంటే కైలాసంలో పార్వతీదేవితో పాటు ప్రమథ గణాలతోపాటు నాట్యంచేస్తూ ఉండి సృష్టి, స్థితుల తర్వాత ముఖ్యమైన ప్రపంచం లయకు కారణమైనవాడు. సాధారణంగా మనందరికీ ఇంతవరకూ తెలుసు. మరి రెండో వాక్యంలోని బ్రహ్మ ఎవరని చెప్పాలి?

ఉపనిషత్తులు చాలా శాస్త్రీయంగా ఆలోచిస్తాయని చెప్పుకున్నాం. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు అనేవి మనం పురాణాల్లో చూసే పేర్లు. ఉపనిషత్తుల్లో వీరి ప్రస్తావన ప్రముఖంగా ఉండదు. అన్నింటికీ మూలకారణమైన పదార్థం లేదా తత్త్వం ఏమిటి అని వేదాంతంలో ప్రశ్న. ఈ మూలతత్త్వానికి పేరు, ఊరు ఉండదు. పేరు, ఊరు ఉన్నాయంటే అది ఆ అడ్రస్సుకే పరిమితమైనట్లు లెక్క. దేవుడనే ఒక పెద్దాయన ఆకాశంలో ఉంటూ ఏదో ఒకానొక రోజు సృష్టికి సంకల్పించి సృష్టి చేశాడు అని మామూలుగా మతాలు చెప్తూంటాయి. మరి సృష్టికి ముందు దేవుడు ఏం చేసేవాడు, ఎలా కాలం గడిపేవాడు, దేవుడు అని మనం అనడంలోనే ఈ దేవుడు పురుషుడు అని చెప్పకనే చెప్తున్నాం. మరి స్త్రీల మాట ఏమిటి? స్త్రీలను మనం కించపరిచినట్లే కదా? దేవుడు, అతనికి వ్యతిరేకంగా రాక్షసులు అంటూ ఉంటే దేవుడి రాజ్యానికి పరిధులు, పరిమితులు ఉన్నట్లే కదా? దేవుడు కూడా ఒక పరిమితమైన వ్యక్తియే కదా?  ఇలాంటి ప్రశ్నలన్నీ వేదాంతి సంధించుకుంటాడు.

వేదాంతి పరిశీలన తన స్వంత శక్తిని పరిశీలించడంతో ప్రారంభమౌతుంది. ఎవరైనా, ఏవిషయాన్నైనా పరిశీలించాలంటే ఆ పరిశీలించే వ్యక్తికి పరిశీలించే సామర్థ్యం ఉండాలి, లేబొరెటరీలో సామగ్రిలాగ పరిశీలనకు కావల్సిన సామగ్రి ఉండాలి. మనిషికి ఉన్న సామగ్రి తనకున్న చూసే శక్తి, వినే శక్తి, వాసన చూసే శక్తి, స్పర్శను గ్రహించే శక్తి, రుచి చూసే శక్తి. ఈ ఐదింటినీ మనం ఐదు ఇంద్రియాలు అని అంటూంటాం. ఈ ఐదు ఇంద్రియాలు తాము గ్రహించిన విషయాల్ని మనస్సుకు అందజేస్తూంటాయి. ఈ ఐదు ఇంద్రియాలు గ్రహించే విషయాలే సంపూర్ణ సత్యం అని చెప్పలేం. ఉదాహరణకు శంకరాచార్యులు ఇలా అంటాడు.

‘ఒక దీపం ఉజ్జ్వల కాంతితో వెలుగుతూ ఉంది. దానిపై ఒక కుండ బోర్లించబడి ఉంది. ఆ కుండకు కొన్ని రంధ్రాలున్నాయి. ఆ రంధ్రాల ద్వారా కొన్ని వెలుగు కిరణాలు బయటకు వస్తున్నాయి. ఆ వెలుగు కిరణాలే మన ఐదు ఇంద్రియాలు మనస్సుకు తెలియజేసే విషయాలు. వాటిని తెలుసుకున్న మనిషి ఓహో నాకు తెలుసు అనుకుంటున్నాడు’ (దక్షిణామూర్తి స్తోత్రం).

మనిషి చూపుకు పరిమితులున్నాయి. మనము ఒక band width లో ఉన్న కాంతిని మాత్రమే చూడగలమని సైన్సు చెబుతుంది. అలాగే శబ్దతరంగాల నిడివిలో అతిచిన్న భాగాన్నే చెవులు వినగలుగుతాయి. అలాగే మిగతా ఇంద్రియాలు కూడా. గబ్బిలాలకు అతీంద్రియ అవగాహన (extra sensory perception) ఉండడం చూస్తాం. అలాగే తుఫానులు, భూకంపాలు వచ్చినపుడు మనకంటే ముందు గాడిదలు సురక్షిత స్థానాలకు పరిగెడతాయి. దీన్నిబట్టి చూస్తే మనిషి ఇంద్రియాల ద్వారా తెలుసుకునే సత్యం అఖండమైన సత్యంలో అతిచిన్న భాగమే. ఇలా మొదలౌవుతుంది వేదాంతుల ఆత్మపరిశీలన.

ఇంతకూ మనం పైన చెప్పుకున్న శ్లోకంలోని ప్రశ్నకు జవాబు ఏమిటి? అన్నింటికంటే గొప్పదైన సత్యం అన్నింటికన్నా తెలివికలదై ఉండాలి. తెలివికలదే కాక అది పూర్తిగా జ్ఞానస్వరూపమై ఉండాలి. అది అన్ని కాలాల్లోనూ ఉండాలి. దీనికి ఒక ప్రారంభమూ, ముగింపూ అనేవి ఉండవు. అది ఎలాంటి పరిమితులూ లేనిదై ఉండాలి. గణితశాస్త్రంలో దీన్నే ఇన్ ఫినిటీ అంటారు. దీన్నే వేదాంతంలో అనంతం అంటారు. వీటన్నింటినీ కలిపితే మనకు మూడు పదాలు దొరుకుతాయి. ఒకటి అన్నికాలాల్లో ఉండేది, దీన్ని సత్యం అంటారు (మనం మామూలుగా కోర్టు పరిభాషలో వాడే సత్యం, అసత్యం కాదు). రెండోది జ్ఞానం. ఇది విశ్వంలో అన్ని జీవుల్లో ఉన్న జ్ఞానానికీ మూలకారణమై ఉండాలి. మూడోది అనంతం. అంటే ఇన్ ఫినిటి. దీన్నే ఉపనిషత్తులో సత్యం, జ్ఞానం, అనంతం అని చెప్తూ ఈ మూడింటినీ కలిపి ‘బ్రహ్మ’ అన్నారు. ప్రతి వస్తువుకూ ఏదో ఒక పేరు ఉండాలి కాబట్టి ఈ తత్త్వాన్ని బ్రహ్మ అన్నారు. సంస్కృతంలో ‘బృంహ’–అంటే అన్నింటికంటే పెద్దది అనే మూలం నుంచి ‘బ్రహ్మ’ అనే పదం ఏర్పడింది. ఇది పుంలింగమూ కాదు, స్త్రీలింగమూ కాదు. అలా అయితే నపుంసకుడైన వ్యక్తి అని విమర్శించే మూర్ఖులు ఉండవచ్చనే భావంతో ఈ బ్రహ్మ అనే తత్త్వం ఒక వ్యక్తి కానే కాదు, కేవల చైతన్యస్వరూపం అని వేదాంతం చెబుతుంది.

పై శ్లోకంలో చూసిన నాలుగు తలల బ్రహ్మ, విష్ణువు, శివుడు ఈ చైతన్యంలో కన్పించే రూపాలే. సృష్టి, స్థితి, లయ అనే ప్రక్రియలకి పురాణాల్లో మనం పెట్టుకున్న పేర్లే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు. సృష్టి చేయడానికి జ్ఞానం అవసరం కావున ఆ జ్ఞానాన్నే సరస్వతి అన్నాం, ఆమెను బ్రహ్మగారి భార్య అన్నాం. ప్రపంచ పోషణకి వివిధ రకాల సంపద అవసరం, దీన్నే లక్ష్మీ అన్నాం. ఆమెను విష్ణువుకు భార్య అని చెప్పాం. అలాగే లయ అంటే ఈ సృష్టిని ముగించే శక్తి. ఆ శక్తినే కాళి లేదా దుర్గ అన్నాం, పరశ్వరుణ్ణి భర్తగా చెప్పాం. ఈ భార్యాభర్తలు, సంసారాలు నిజానికి చైతన్యంలో ఏర్పడుతున్న వివిధ మార్పులకి మనం పెట్టుకున్న పేర్లు.   గురువు ఇలాంటి చైతన్యం యొక్క జ్ఞానాన్ని మనకందించడం వల్ల గురువును పైవిధంగా ప్రశంసించడం మన సంప్రదాయం.

(This article was first published by IndiaFacts.)

(Image credit: manthanhub.com)

Disclaimer: The opinions expressed in this article belong to the author. Indic Today is neither responsible nor liable for the accuracy, completeness, suitability, or validity of any information in the article.

Leave a Reply